ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బుడమేరు వాగుకు సంబంధించిన సమస్యపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టతనిచ్చారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. బుడమేరు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివరించారు.
సభ్యుల ఆందోళనసభ్యులు సుజనా చౌదరి, వసంత కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు బుడమేరు సమస్యపై గంభీరతను ప్రస్తావిస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. బుడమేరు ఆక్రమణలు అరికట్టి, వాగులు కాల్వల మరమ్మతులు వెంటనే చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. తక్షణ చర్యలు లేకుంటే విజయవాడ మునగడం ఖాయమని సభ్యులు హెచ్చరించారు.
మంత్రి సమాధానందీనిపై మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ బుడమేరు సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఈ సమస్యను కేబినెట్ సమావేశంలో ప్రస్తావించినట్టు వెల్లడించారు. బుడమేరు డైవర్షన్ పనులకు కేంద్ర సహకారం అవసరమని, దీనిపై కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిపారు. ముఖ్యంగా వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనికపాడు మీదుగా 10 వేల క్యూసెక్కుల తరలింపు ప్రణాళికపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేపట్టినట్లు మంత్రి వివరించారు.
గత ప్రభుత్వ వైఖరిమంత్రి నిమ్మల మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలోనే బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్కులకు పెంచేందుకు రూ.464 కోట్లతో టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఈ పనుల్లో 80 శాతం పూర్తయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం మిగిలిన 20 శాతం పనులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలుబుడమేరు గట్లు మరమ్మత్తుల కోసం రూ.39.05 కోట్లతో కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలోనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు వివరించారు.
భవిష్యత్తు ప్రణాళికవెలగలేరు రెగ్యులేటర్ నుంచి కొల్లేరు వరకు ఓల్డ్ ఛానెల్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. బుడమేరు ఓల్డ్ ఛానెల్‌కు సమాంతరంగా 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కొత్త ఛానల్ అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర సహకారంతో బుడమేరు వరద నియంత్రణ చర్యలు చేపడతామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.

One thought on “బుడమేరు సమస్యపై మంత్రి నిమ్మల సమాధానం”
Comments are closed.