పసుపు రైతుల సమస్యపై కవిత ఆగ్రహం

kavitha

తెలంగాణలో పసుపు రైతుల సమస్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేశామని చెప్పిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడంలేదని మండిపడ్డారు.

మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ పసుపు రైతుల సమస్యలపై ప్రభుత్వాల తీరును తీవ్రంగా ఎండగట్టారు. నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏమి చేస్తోందని నిలదీశారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పసుపు పంటకు క్వింటాకు రూ. 15 వేల మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని కవిత గుర్తుచేశారు. కానీ ఇప్పుడు పసుపు పంటకు కనీసం రూ. 9 వేలు కూడా లభించడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రైతులను మోసం చేయడమేనని ధ్వజమెత్తారు.

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ఎలాంటి ప్రయోజనాలు కలగడం లేదని కవిత తెలిపారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పసుపు రైతులకు ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారని… కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పసుపు రైతులను ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

Read More