తెలంగాణలో కాంగ్రెస్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

కరీంనగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు ప్రజలను అవమానించే విధంగా ఉన్నాయని, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వార్డు మెంబర్‌గానైనా గెలవలేని వ్యక్తి దొంగ ఓట్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. “గజినీ సినిమా లాగా మహేశ్ గౌడ్ వ్యాఖ్యలు మారిపోతున్నాయి” అంటూ వ్యాఖ్యానించారు.

అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని బండి సంజయ్ మండిపడ్డారు. మహిళలకు రూ.2,500 భృతి, పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, తులం బంగారం, స్కూటీలు అన్నీ ఎక్కడా కనిపించడం లేదని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. కరీంనగర్‌లోని కొన్ని మైనారిటీ ఇళ్లలో ఒక్కో ఇంటికి వందల ఓట్లు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

హిందూ ధర్మం కోసం బీజేపీ ఎప్పుడూ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. “భైంసాలో హిందువుల ఇళ్లు తగలబెట్టినప్పుడు కాంగ్రెస్ నేతలు ఎక్కడ దాక్కున్నారు? హిందూ పండుగలకు గుళ్లలో సౌండ్ పెట్టొద్దని చెప్పడం దుర్మార్గం” అని తీవ్రంగా విమర్శించారు. యూపీఏ పాలనలోనే రోహింగ్యాలు దేశంలోకి పెద్ద ఎత్తున ప్రవేశించారని, డ్రామాలు ఆడేది కాంగ్రెస్ నేతలేనని ఆరోపించారు.

Read More : హైదరాబాద్ రేవ్ పార్టీ కేసులో డిప్యూటీ తహసీల్దార్ ప్రమేయం

2 thoughts on “తెలంగాణలో కాంగ్రెస్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

Comments are closed.