హైదరాబాద్ రేవ్ పార్టీ కేసులో డిప్యూటీ తహసీల్దార్ ప్రమేయం

హైదరాబాద్‌లో రేవ్ పార్టీ కేసు సంచలనం సృష్టించింది. కొండాపూర్‌లోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు దాడి చేసి, డ్రగ్స్‌తో పార్టీ చేసుకుంటున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ కీలక పాత్ర పోషించినట్లు బయటపడింది. మాదాపూర్ డీసీపీ డాక్టర్ జి. వినీత్ వివరాల ప్రకారం, ఆదివారం రాత్రి రాజరాజేశ్వరి నిలయం సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో రేవ్ పార్టీ జరుగుతుందని పక్కా సమాచారం అందింది. దాంతో ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో తేజ, విక్రమ్, నీలిమ, వైన్ షాప్ యజమాని పురుషోత్తంరెడ్డి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భార్గవ్, ఇంజినీరింగ్ విద్యార్థి చందన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి 20 గ్రాముల కొకైన్, 20 గ్రాముల ఎకస్టీ పిల్స్, 3 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం అయింది.

విచారణలో నిందితులు షాకింగ్ విషయాలు ఒప్పుకున్నారు. రాజమండ్రిలో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ నిర్వహించే పార్టీలకు తరచూ హాజరయ్యేవారని, గోవాలో ఆయన ఏర్పాటు చేసిన ఒక పార్టీలో బెంగళూరుకు చెందిన డ్రగ్స్ సరఫరాదారు రాహుల్‌తో పరిచయం ఏర్పడిందని వెల్లడించారు. అప్పటి నుంచి రాహుల్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో పార్టీలు చేసుకుంటున్నట్లు అంగీకరించారు. చందన్‌ ద్వారా రాహుల్ సరఫరా చేసినట్లు కూడా తెలిపారు.

ప్రస్తుతం డ్రగ్స్ సప్లయర్ రాహుల్‌తో పాటు డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ పరారీలో ఉన్నారని, వారిని నిందితులుగా చేర్చామని డీసీపీ వినీత్ వెల్లడించారు. ఇప్పటికే విక్రమ్ గతంలోనూ డ్రగ్స్ కేసులో పట్టుబడినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Read More : జూబ్లీహిల్స్‌లో ₹100 కోట్లు భూమి ఆక్రమణల నుంచి విముక్తి

One thought on “హైదరాబాద్ రేవ్ పార్టీ కేసులో డిప్యూటీ తహసీల్దార్ ప్రమేయం

Comments are closed.