ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు నేడు విశాఖపట్నం చేరుకుంటున్నారు. రేపు ఉదయం విశాఖ ఆర్కే బీచ్‌లో నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొననున్న సందర్భంగా అధికారులు ఏర్పాట్లన్నింటిని పూర్తి చేశారు.
వివరాల్లోకి వెళితే, ప్రధానమంత్రి మోదీ ఈ సాయంత్రం ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 6.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని ఆఫీసర్స్ మెస్‌కు చేరుకుంటారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పలువురు పార్లమెంట్ సభ్యులు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. రాత్రి ఆయన తూర్పు నౌకాదళ అతిథి గృహంలో బస చేస్తారు.
రేపు ఉదయం ప్రధాని యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 6.25కి రోడ్డు మార్గంలో ఆర్కే బీచ్‌కి చేరుకుని, 6.30 నుంచి 7.50 గంటల వరకు యోగా విన్యాసాలు చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సుమారు 5 లక్షల మంది ప్రజలు ఈ యోగా ప్రదర్శనలో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేయబడుతోంది. యోగా కార్యక్రమం అనంతరం ప్రధాని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
ప్రధానమంత్రి అనంతరం ఉదయం 7.50 గంటలకు ఆర్కే బీచ్ నుంచి బయలుదేరి ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్‌కు చేరుకుంటారు. అక్కడ ఉదయం 8.15 నుంచి 11.15 వరకు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తరువాత, 11.25కి ఐఎన్‌ఎస్ పరేడ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ ద్వారా విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, 11.50కి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
ఈ సందర్భంగా, ఇటీవల పెహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన విశాఖ వాసి చంద్రమౌళి భార్యను ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగతంగా కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
read More : CM : భారీగా ఏర్పాట్లు చేసిన ఏపీ ప్రభుత్వం

2 thoughts on “విశాఖలో మోదీ యోగా పర్యటన”
Comments are closed.