ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ (బుధవారం) ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి మండలితో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. మొత్తం 12 అంశాలు ఎజెండాగా ఉండగా, వాటిపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ముఖ్యంగా, రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు అంశంపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అదేవిధంగా, 2024 నుంచి 2029 వరకు అమల్లో ఉండే ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 4.0కు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
టూరిజం రంగంలో భాగంగా 22 ఏపీ టూరిజం డెవలప్మెంట్ హోటళ్లు, ఆరు క్లస్టర్ల పరిధిలోని రిసార్టుల ఆపరేషన్ల కోసం ఏజెన్సీల ఎంపికకు వీసీ అండ్ ఎండీకి అనుమతులు ఇవ్వనుంది. తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు గ్రామంలో ఓబెరాయ్ హోటళ్ల నిర్మాణానికి గతంలో ఇచ్చిన టీటీడీ భూమి బదిలీని రద్దు చేసే అంశంపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
పవర్ సెక్టార్లో ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులకు రూ.900 కోట్లు గ్యారంటీ ఇవ్వడం, హెయిర్ కటింగ్ సెలూన్లకు ఉచిత విద్యుత్ పరిమితిని 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచడం వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. అదేవిధంగా, ఏపీఎస్సీడీసీఎల్, ఏపీసీపీసీఎల్కు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసిన రూ.3545 కోట్లు, రూ.1029 కోట్ల రుణాలకు ప్రభుత్వ గ్యారెంటీపై నిర్ణయం తీసుకోనుంది.
అదనంగా, పాఠశాల విద్యలో పలు జీవోలు, కాంప్రహెన్సివ్ ఏపీ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2025కు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) మరియు దాని అనుబంధ సంస్థలపై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగించే అంశం, పుట్టపర్తి, మొవ్వ, గన్నవరం, గాజువాక, తిరుపతిలో 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల సృష్టి వంటి అంశాలపై కూడా కేబినెట్ చర్చించనుంది.
Read More : P4 కార్యక్రమానికి శ్రీకారం

One thought on “ఏపీ కేబినెట్ కీలక సమావేశం”
Comments are closed.