ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఏ1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ అధికారులు నిర్వహించిన దర్యాప్తులో, రాజశేఖర్ రెడ్డి సుమారు రూ.13 కోట్లతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు బయటపడింది. వాటిలో కొన్ని ఆయన బంధువుల పేర్లపై కూడా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో కొత్త నిబంధనల ప్రకారం ఆస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జగన్ హయాంలో జే బ్రాండ్ మద్యం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, అధికారంలోకి వస్తే దర్యాప్తు చేస్తామని టీడీపీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. 2024లో కూటమి గెలుపుతో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు కాగా, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని నియమించింది.
సిట్ దర్యాప్తులో ఇప్పటివరకు రూ.3,200 కోట్ల విలువైన భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి తదితరులు ఇప్పటికే అరెస్టు అయ్యారు. తాజాగా ఏ1 రాజశేఖర్ రెడ్డి ఆస్తుల జప్తుపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కేసులో కీలక మలుపుగా భావిస్తున్నారు.
Read More : ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం

One thought on “ఏ1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆస్తుల జప్తు”
Comments are closed.