అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు వ్యవసాయానికి 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ రంగంలో తొలిసారిగా డ్రోన్ సాంకేతికత ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. భూమి ఉన్న రైతులకు గుర్తింపు సంఖ్యను అందిస్తున్నామని, అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు ఇస్తున్నట్లు వివరించారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ రూపొందించిన ప్రభుత్వం, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దేశ, రాష్ట్ర అభివృద్ధికి వ్యవసాయ రంగమే ప్రధాన బలమైన కేడర్ అని మంత్రి పేర్కొన్నారు. సాంకేతికత వినియోగంతో సాగు ఖర్చులు తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
గత ప్రభుత్వం బకాయిగా ఉన్న రూ.120 కోట్ల విత్తన రాయితీను చెల్లించామని, ఇప్పటి వరకు 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 11 ముఖ్యమైన పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి, ఎరువుల నిర్వహణ కోసం రూ.40 కోట్లు కేటాయించామని చెప్పారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రూ.61 కోట్లు, వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ.139 కోట్లు కేటాయించినట్లు వివరించారు. 7.78 లక్షల క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందజేశామని మంత్రి తెలిపారు.
875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, డ్రోన్‌ల కొనుగోలుకు రూ.80 కోట్లు కేటాయించిందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ అభివృద్ధికి రూ.219 కోట్లు, విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాల కోసం రూ.250 కోట్లు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ అమలుకు రూ.9,400 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు కేటాయించామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
