రైతుల కోసం మరో మంచి నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కౌలు రైతులకు కూడా ‘అన్నదాత సుఖీభవ’ పథకం ప్రయోజనాలు అందించనున్నట్లు ప్రకటించింది. భూ యాజమాన్యం లేకుండా ఇతరుల భూములపై సాగు చేస్తున్న రైతులను కూడా ఆర్థిక సహాయానికి అర్హులుగా గుర్తించి వారికీ సంవత్సరానికి రూ.20,000 చొప్పున మూడుసార్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది.

ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ పథకం కింద లభించే రూ.6,000 కూడా చేర్చబడుతుంది. దీంతో ప్రతి అర్హ రైతు కుటుంబానికి పూర్తి స్థాయిలో మద్దతు అందనుంది. కేవలం భూమి యజమానులకే కాదు, అటవీ హక్కు పత్రాలు (ROFR) కలిగిన రైతులు, కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులవుతారు.

ఈ మేరకు జిల్లా, మండల స్థాయిలలో అధికారులను రైతుల గుర్తింపుపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. మే 20వ తేదీలోగా అర్హుల జాబితాలను ‘అన్నదాత సుఖీభవ’ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని స్పష్టం చేసింది.

కుటుంబాన్ని (భర్త, భార్య, మైనర్ పిల్లలు) ఒక యూనిట్‌గా పరిగణిస్తూ పథకం అమలు చేయబడనుంది. వివాహమైన పిల్లలు వేరే యూనిట్‌గా లెక్కించబడతారు. వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పట్టు పరిశ్రమలకు సంబంధించిన పంటలు సాగు చేస్తున్న రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.

అయితే, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, ఆర్కిటెక్టులు, ఆదాయపు పన్ను చెల్లించిన వారు వంటి వృత్తి నిపుణులను ఈ పథకం నుంచి మినహాయించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం రాష్ట్రంలో వేలాది మంది కౌలు రైతులకు ఆశాజ్యోతి నింపనుంది.

Read More : తిరుమల :ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి!

One thought on “రైతుల కోసం మరో మంచి నిర్ణయం

Comments are closed.