నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి మిశ్రమ అనుభవాలు.

నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టులో మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. హనుమాన్ జంక్షన్ పోలీసులు వంశీని రెండోసారి పోలీసు కస్టడీకి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఖండించింది. ఇదే కేసులో ఇప్పటికే రెండు రోజులపాటు వంశీని విచారించిన నేపథ్యంలో మళ్లీ కస్టడీ అవసరం లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

విచారణ సమయంలో వంశీ అనారోగ్యంతో బాధపడిన కారణంగా విచారణ పూర్తిగా జరగలేదని పోలీసులు వాదించినా, కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఇదిలా ఉండగా, ఈ కేసులో వంశీ రిమాండ్ నేటితో ముగియడంతో, ఆయనను వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం వంశీకి జూన్ 12 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక వంశీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన నూజివీడు కోర్టును అభ్యర్థించారు. దీనిపై పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూన్ 2కి వాయిదా వేసింది.

ఇక మరోవైపు, అక్రమ మైనింగ్ కేసులో వంశీకి కీలకంగా తోడ్పడినట్టు భావిస్తున్న ఆయన అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగాను రెండు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. పోలీసులు ఆయనను విజయవాడ జైలులో నుంచి గన్నవరం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల అనంతరం విచారణ చేపట్టారు.

Read More : మినిస్టర్ లోకేష్ రెడ్బూక్ పై వ్యాఖ్యలు