ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై విచారణకు ఆదేశాలు: మంత్రి లోకేష్

Nara Lokesh

ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University) మాజీ వైస్ చాన్సలర్ ప్రసాదరెడ్డి అక్రమాలపై దర్యాప్తు జరపాలని విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి రూలింగ్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) విశాఖపట్నం పర్యటన సందర్భంగా విద్యార్థులను రోడ్డుపైకి తీసుకువచ్చి స్వాగతం పలికించారని, రూసా గ్రాంట్స్, ఇస్రో గ్రాంట్‌లను దుర్వినియోగం చేశారని మంత్రి ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఇన్చార్జి వీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కమిటీ విచారణ.. తేల్చాల్సిన నిజాలు
ఈ కమిటీకి 60 రోజుల వ్యవధి లోగా నివేదిక ఇవ్వాలని సూచించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఈ విచారణలో ఏవైనా అవకతవకలు రుజువైతే తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఏయూ ప్రాశస్త్యాన్ని పునరుద్ధరించేందుకు కృషి
ఆంధ్రా యూనివర్సిటీ అనగానే దేశ, విదేశాల్లో ఘనత సాధించిన పలువురు ప్రముఖులు గుర్తుకు వస్తారని, ఈ ప్రతిష్ఠను మరింత పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని లోకేష్ తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీని ప్రపంచంలోని టాప్ 100 విద్యాసంస్థల్లో నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.

తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యేలు
టీడీపీ నేతలు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు తదితరులు ప్రసాద్ రెడ్డి అక్రమాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఫండ్స్ దుర్వినియోగం, అక్రమ నియామకాలు, యూనివర్సిటీలో రాజకీయ కార్యకలాపాలకు పాల్పడటం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రసాద్ రెడ్డిపై విచారణ తప్పనిసరి అని వారు స్పష్టం చేశారు.

విజిలెన్స్ విచారణకు డిమాండ్
ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఏయూ గొప్పతనాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి లోకేష్ తెలిపారు.

2 thoughts on “ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డిపై విచారణకు ఆదేశాలు: మంత్రి లోకేష్

Comments are closed.