శాసనమండలిలో పెన్షన్ల అంశంపై ఆసక్తికర చర్చ

Minister Kondapalli Srinivas

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ల అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది. మండలిలో ప్రశ్నోత్తరా సమయంలో పెన్షన్ల సంఖ్య తగ్గింపుపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు సంధించగా, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ వివరణ ఇచ్చారు.

వైసీపీ సభ్యుల ఆరోపణలు:
వైసీపీ సభ్యులు పెన్షన్ల విషయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దివ్యాంగుల పెన్షన్లను కూడా తగ్గించారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. పేదలకు ఇచ్చే పెన్షన్లను తొలగించారని, దాదాపు రెండు లక్షల పెన్షన్లు తగ్గించారని వైసీపీ సభ్యుడు రమేష్ యాదవ్ తెలిపారు. వైసీపీ హయాంలో ఐదేళ్లలో 13 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేశామని ఆయన వెల్లడించారు.

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరణ:
ఈ ఆరోపణలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధీటైన సమాధానం ఇచ్చారు. పెన్షన్లను తీసుకువచ్చింది ఎన్టీఆర్ అని మంత్రి స్పష్టం చేశారు. రూ.200 నుంచి రూ.1000, ఆ తర్వాత రూ.2000 వరకు పెన్షన్ పెంచింది టీడీపీ ప్రభుత్వమని గుర్తుచేశారు. తాజా ప్రభుత్వం పెన్షన్ల మొత్తాన్ని రూ.3000 నుంచి రూ.4000కు పెంచిందని తెలిపారు.

పెన్షన్ల తగ్గింపుపై మాట్లాడిన మంత్రి, “2019 నుంచి 2024 వరకు 24 లక్షల పెన్షన్లు తగ్గించాం. అయితే, ఇందులో రెండున్నర లక్షల మంది మృతి చెందిన కారణంగా తొలగించాల్సి వచ్చిందని” పేర్కొన్నారు. ఇక పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులు ఉన్నారని, గత ప్రభుత్వంలో అనర్హులకు పెన్షన్లు మంజూరు చేశారని ఆయన విమర్శించారు.

ఆడబిడ్డ నిధి పథకంపై మంత్రి సమాధానం:
ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడంపై వైసీపీ సభ్యులు ప్రశ్నించగా, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానమిస్తూ, “ప్రణాళికా ప్రకారం నిధుల కేటాయింపునకు ప్రభుత్వం పనిచేస్తోందని” తెలిపారు. ఈ పథకం కోసం ఏడాదికి రూ.32,000 కోట్ల నిధులు అవసరమని తెలిపారు. “సమయం తీసుకున్నా పథకాన్ని తప్పకుండా అమలు చేస్తాం” అని మంత్రి స్పష్టం చేశారు.

Read More