తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ప్రతీ ఏడాదికంటే వేగంగా తీవ్రత పెంచుకుంటూ పోతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలు దాటితే చాలు.. ఎండవేడిమితో బయట అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంటోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వడగాలుల అలర్ట్
ఏపీలో వేడిగాలుల ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో 15 మండలాలు, విజయనగరం జిల్లాలో 20 మండలాలు, పార్వతీపురం మన్యంలో 14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, కాకినాడ జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
నిన్న నంద్యాల జిల్లా చాగలమర్రిలో 42.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవగా, వైఎస్‌ఆర్ కడప జిల్లా అట్లూరు, ఖాజీపేటలో 41.2 డిగ్రీలు, ప్రకాశం జిల్లా గొల్లవిడిపిలో 40.7 డిగ్రీలు, కర్నూలులో 40.6 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా కంబాలకుంటలో 40.2 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరంలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో వర్ష సూచన
తెలంగాణలో వడగాలులతో పాటు ఉక్కపోత కూడా కొనసాగుతోంది. నేడు మెదక్, నిజామాబాద్‌లో 40.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. నల్లగొండ, హనుమకొండ జిల్లాల్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
అలాగే రేపు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
నిన్న ఆదిలాబాద్‌లో 40 డిగ్రీలు, మెదక్‌లో 40 డిగ్రీలు, నిజామాబాద్‌లో 39.6 డిగ్రీలు, భద్రాచలంలో 38.8 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 38.5 డిగ్రీలు, రామగుండంలో 38.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎండలు, ఉక్కపోత నుంచి తలదాచుకునేందుకు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

2 thoughts on “తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు”
Comments are closed.