చెత్త పన్ను రద్దు.. డిసెంబర్ 31 నుంచి అమల్లోకి
నగరాలు, పట్టణాల్లో ప్రజలపై విధించిన చెత్త పన్ను నుంచి విముక్తి లభించింది. 2024 డిసెంబర్ 31 నుంచి చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు 2024 డిసెంబరులో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించింది. అనంతరం గవర్నర్ అనుమతి అనంతరం గెజిట్ విడుదల కాగా, ఇప్పుడు అధికారికంగా నోటిఫికేషన్ వెలువడింది.
ఈ క్రమంలో చెత్త పన్ను వసూలు చేసేందుకు వీలుగా 1965 ఏపీ మున్సిపల్ చట్టంలో చేర్చిన సెక్షన్ 170-బి, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం-1955లోని సెక్షన్ 491-ఎలను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
గత ప్రభుత్వం 2021 నవంబర్‌లో 40 పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థల్లో చెత్త పన్ను విధించింది. దీని ద్వారా ప్రభుత్వం ప్రజల నుంచి రూ.187.02 కోట్లను వసూలు చేసింది. అయితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైనా అప్పటి ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పన్నును పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
