ఆంధ్రప్రదేశ్‌లో పేరు మార్పు వివాదం మరోసారి రాజకీయ రచ్చ రేపుతోంది. ఇటీవలే వైయస్‌ఆర్ జిల్లా పేరును వైయస్‌ఆర్ కడప జిల్లాగా మార్చిన ఏపీ కేబినెట్ తాజాగా విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీబీ వీడీసీఎం స్టేడియం పేరులోనూ వైఎస్‌ఆర్ పేరు తొలగించింది. ఈ ఘటనపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్‌ఆర్ పేరును తొలగించే చర్యలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నాయకులు విశాఖ స్టేడియం వద్ద ఈ రోజు ఆందోళనకు పిలుపునిచ్చారు.
పేరు మార్పుపై తీవ్ర విమర్శలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ విగ్రహాన్ని తొలగించారని, బాపట్లలో వైఎస్ విగ్రహాన్ని తగలబెట్టారని వైసీపీ నేతలు విమర్శించారు. విశాఖలో వైఎస్‌ఆర్ స్టేడియం పేరును తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు.
పథకాలపై కూడా ప్రభావం
అధికార మార్పుతో ఏపీ పాలిటిక్స్‌లో పేర్ల మార్పు వివాదం కొనసాగుతోంది. గతంలో వైసీపీ హయాంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన జగన్ ప్రభుత్వం, ఇప్పుడు తిరిగి ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టింది కూటమి ప్రభుత్వం. విశాఖ సీతకొండ హిల్‌వ్యూ పాయింట్‌ను వైఎస్‌ఆర్ పేరు పెడితే.. ఇప్పుడు దానికి అబ్దుల్ కలామ్ వ్యూ పాయింట్‌గా పేరు మార్చారు.
పథకాల పేర్లు మార్పు
జగన్ హయాంలో అమలు చేసిన పథకాల పేర్లను కూడా మార్చింది కూటమి ప్రభుత్వం. జగనన్న అమ్మఒడి పేరును ‘తల్లికి వందనం’, జగనన్న విద్యా కానుకను ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’, జగనన్న గోరుముద్దను ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం’, జగనన్న ఆణిముత్యాలను ‘అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం’గా మార్పు చేశారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేరు ‘ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా’గా మార్చారు.
ఈ మార్పులను వైసీపీ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. రాష్ట్రంలో వైఎస్ పేరు కనిపిస్తే కూటమి పార్టీలకు భయం పుడుతోందని.. అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది.

One thought on “పేరు మార్పు వివాదం: ఏపీలో వేడెక్కిన రాజకీయాలు”
Comments are closed.