ఉక్రెయిన్‌కు ఆయుధ సహాయం తగ్గించిన అమెరికా

ఉక్రెయిన్‌కు అందిస్తున్న ఆయుధాల సరఫరాపై అమెరికా ప్రభుత్వం కీలకంగా స్పందించింది. దేశీయ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, కొంతమేర ఆయుధాల పంపకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా ఆయుధ నిల్వలు ఆందోళనకరంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, “బైడెన్ పాలనలో ఉక్రెయిన్‌కు అవసరమైనన్ని కంటే ఎక్కువగా ఆయుధాలను తరలించడం వల్లే దేశం లోపల ఆయుధ నిల్వలు ఖాళీ అయ్యాయి. ముందుగా అమెరికా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే కీవ్‌కు సరఫరా చేసే ఆయుధాల్లో కొన్ని రకాలపై కోత విధించాం” అని వివరించారు. ఇటీవల పెంటగాన్‌ నిర్వహించిన సమీక్షలో, దేశీయ అవసరాలను కూడా తీర్చలేని స్థాయిలో ఆయుధ నిల్వలు తగ్గినట్లు గుర్తించారు. దీంతో ఉక్రెయిన్‌కి హామీ ఇచ్చిన కొన్ని ఆయుధాల షిప్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్టు వెల్లడించారు. అయితే ఏయే ఆయుధాలను నిలిపినారన్న వివరాలు మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.

2022 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికా సుమారు 66 బిలియన్ డాలర్ల విలువైన సైనిక సహాయాన్ని ఉక్రెయిన్‌కు అందించిన విషయం తెలిసిందే. గత బైడెన్ పాలనలో భారీ స్థాయిలో ఆయుధాల పంపకాలు, ఆర్థిక సహాయాలు జరిగాయి. తాజాగా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

READ mORE : డిప్యూటీ ఆర్మీ చీఫ్ రాహుల్ ఆర్ సింగ్ ప్రకటన