అమెరికా వాణిజ్య విధానంపై ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కొత్త వాణిజ్య సుంకాలపై టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం అమెరికాలో రాజకీయంగా, ఆర్థికంగా చర్చనీయాంశంగా మారాయి.

‘‘ఈ ఏడాది ద్వితీయార్ధంలో ట్రంప్ తీసుకురానున్న దూకుడైన సుంకాలు దేశాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టే అవకాశం ఉంది,’’ అని మస్క్ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్టు చేశారు. ‘‘అమెరికా దివాలా తీస్తే, మిగిలిన విషయాలన్నీ ప్రయోజనం లేకుండా పోతాయి,’’ అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలతో ట్రంప్–మస్క్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న బహిరంగ వివాదం మరింత ముదిరింది. దీంతో టెస్లా షేర్లు గురువారం ఒక్కరోజే 14 శాతం పతనమై, దాదాపు 150 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కోల్పోయాయి.

ఇదిలా ఉండగా, ట్రంప్ కూడా ఎలాన్‌ మస్క్‌ను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలంటే మస్క్ కంపెనీలతో ఉన్న ఒప్పందాలు, సబ్సిడీలను రద్దు చేయడమే సరైన మార్గం,’’ అని వ్యాఖ్యానించారు.

దీనిపై స్పందించిన మస్క్, ‘‘ఇలాంటివి జరుగుతున్న క్రమంలో, స్పేస్‌ఎక్స్ తన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఉపసంహరించే ప్రక్రియను తక్షణమే ప్రారంభిస్తోంది,’’ అని స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో ట్రంప్ గెలుపు కోసం 250 మిలియన్ డాలర్లకు పైగా విరాళం ఇచ్చినట్టు గుర్తుచేస్తూ, ‘‘ఆయన కృతజ్ఞత కూడా తెలియచేయలేదు,’’ అంటూ మస్క్ విరుచుకుపడ్డారు.

‘‘నా లాంటి వ్యక్తులు అమెరికాలో 40 ఏళ్లకు పైగా ఉంటారు. కానీ ట్రంప్‌కు మరో 3.5 సంవత్సరాలే మిగిలి ఉన్నాయి. ఈ అంశం ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి,’’ అంటూ మరో పోస్టులో మస్క్ వ్యాఖ్యానించారు.

ఇక ట్రంప్ కూడా మస్క్ విమర్శలపై స్పందిస్తూ, ‘‘అతనిపై చాలా నిరాశగా ఉంది,’’ అన్నారు. దానికి మస్క్ స్పందన కూడా తక్షణమే వచ్చింది – ‘‘అయితే ఏంటి (వాటెవర్)’’ అంటూ తేలికగా తప్పించేశారు.

ఈ పరిణామాలతో అమెరికా రాజకీయ వర్గాల్లో తోపులాట తారాస్థాయికి చేరింది. మస్క్-ట్రంప్ మధ్య వివాదం ఇంకా ఎంత దూరం వెళ్లనున్నదో వేచి చూడాల్సిందే.

Read More : ఉక్రెయిన్ యుద్ధానికి పూర్తి మద్దతుతో ఉత్తర కొరియా

One thought on “అమెరికా వాణిజ్య విధానంపై ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు

Comments are closed.