అహ్మదాబాద్‌లో జూన్ 12న చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని విషాదంలో ముంచేసింది. ఈ దుర్ఘటనలో 274 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న ఈ ఘటనలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రమాదానికి గురైన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం గత 12 సంవత్సరాలుగా సేవలందిస్తోంది. దర్యాప్తులో భాగంగా, ఈ విమానం కుడివైపు ఇంజిన్‌ను కేవలం మూడు నెలల క్రితమే ఓవర్‌హాలింగ్ సమయంలో ప్రతిష్టించారని అధికారులు గుర్తించారు. గత నిర్వహణ జూన్ 2023లో జరిగితే, తదుపరి షెడ్యూల్ డిసెంబర్ 2025కి ఉందని సమాచారం.
ఇక ఈ దుర్ఘటనతో బీమా వివరాలు ప్రధాన చర్చగా మారాయి. ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా సంస్థ విమాన బీమా కవరేజీని రూ.750 కోట్ల నుంచి రూ.850 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ప్రమాదం దేశ చరిత్రలోనే అత్యధిక విమాన బీమా క్లెయిమ్‌గా నిలవనుంది.
జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (GIC) అంచనా ప్రకారం, మొత్తం బీమా క్లెయిమ్ విలువ 475 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.4,091 కోట్లు) ఉండే అవకాశం ఉంది. ఇందులో విమాన నష్టానికి గాను 125 మిలియన్ డాలర్లు కాగా, మిగిలిన 350 మిలియన్ డాలర్లు ప్రయాణికుల కుటుంబాలకు పరిహారం, థర్డ్ పార్టీ నష్టాలు, ఇతర ట్రావెల్ పాలసీల కింద చెల్లించాల్సిన మొత్తమని GIC సీఎండీ రామస్వామి నారాయణన్ తెలిపారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఎయిర్ ఇండియాపై పడే భారం విమానం అసలైన ధరకంటే దాదాపు రెండున్నర రెట్లు అధికమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రమాదంపై దర్యాప్తు ప్రస్తుతం వేగంగా సాగుతోంది.
Read More : ప్రైవేట్ వాహనాలకు ఫాస్టాగ్ వార్షిక పాస్

One thought on “బీమా క్లెయిమ్ దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో ఉండే అవకాశం.”
Comments are closed.