హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభం.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్‌ (GSEC) ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్‌గా ఇది నిలిచిందని, ప్రపంచంలో ఇలాంటివి ఐదు మాత్రమే ఉండగా, ఒక్కటి హైదరాబాద్‌కు రావడం గర్వకారణమన్నారు.

డిజిటల్ యుగంలో గోప్యత, భద్రత కీలకమైందన్నారు. “మన ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ పాలన, రోజువారీ జీవితం మొత్తం డిజిటల్ ఆధారంగా సాగుతోంది. డిజిటల్ భద్రత బలంగా ఉంటే అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది” అని ఆయన పేర్కొన్నారు. గూగుల్ ఈ సెంటర్ ద్వారా సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

తెలంగాణ పెట్టుబడులకు హబ్

ఉత్తమ పెట్టుబడులకు తెలంగాణ అనుకూల రాష్ట్రమని సీఎం పేర్కొన్నారు. గూగుల్ స్థాపనతో పాటు ఇతర గ్లోబల్ కంపెనీలు కూడా హైదరాబాద్‌ను కేంద్రంగా అభివృద్ధి చేసుకుంటున్నాయని, 2035 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యం తమదేనన్నారు. అలాగే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పాన్ని వ్యక్తం చేశారు.

గూగుల్, తెలంగాణ మధ్య పాత అనుబంధం

2007లో కాంగ్రెస్ హయాంలో గూగుల్ హైదరాబాద్‌లో తన మొదటి కార్యాలయం నెలకొల్పిందని గుర్తుచేశారు. నేడు దాదాపు 7,000 మంది గూగుల్ ఉద్యోగులు ఇక్కడ పని చేస్తున్నారని తెలిపారు. గూగుల్ పక్కన స్థలంలో మహిళల స్వయం సహాయక సంఘాలకు స్టాల్స్ ఏర్పాటు చేయడం ద్వారా వారికి ఆదాయం వచ్చేలా చేస్తున్నామని వివరించారు.

ట్రాన్స్‌జెండర్లకు అవకాశాలు – నూతన విద్యా విధానం

హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్లను చేర్చడం, జీహెచ్‌ఎంసీలోనూ వారికి అవకాశాలు కల్పించడంపై సీఎం వెల్లడించారు. యువతకు నైపుణ్యాలను అందించేందుకు “యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ” ను ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి, జీవన ప్రమాణాల పెంపు ముఖ్య ఉద్దేశ్యాలని స్పష్టం చేశారు.

సమర్పణతో పనిచేయండి – గూగుల్‌కు సీఎం సూచన

“గూగుల్ సంస్థతో పాటు మా ప్రభుత్వం కూడా ‘మంచిని మాత్రమే చెయ్యాలి’ అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది. గూగుల్ హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేయడం రాష్ట్రానికి గర్వకారణం. మా ప్రజలకు మెరుగైన జీవనం అందించేందుకు కలిసి పనిచేద్దాం” అంటూ సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

Read More : టోనీ బ్లెయిర్‌తో సమావేశం కోసం ఢిల్లీ వెళ్తున్న సీఎం.

One thought on “హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రారంభం.

Comments are closed.