వల్లభనేని వంశీ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో బ్యారక్ మార్పు కోసం పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ, తనకు ఉన్న బ్యారక్ మార్పు కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
వంశీ తరఫున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ, తనను ప్రస్తుతం ఉన్న బ్యారక్ నుంచి మార్చాలని లేదా తన బ్యారక్‌లో మరికొంత మంది ఖైదీలను ఉంచాలని కోరారు. 6-4 బ్యారక్ కేటాయించారని, కానీ అక్కడ మంచం కూడా లేదని, ఇది సోలిటరీ కన్ఫైన్మెంట్ కిందకి వస్తుందని తెలిపారు.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసులు వంశీని మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. విజయవాడలోని కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో వంశీని ప్రశ్నించారు. విచారణలో అనేక ప్రశ్నలకు వంశీ సమాధానం ఇవ్వకుండా, “తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను” అనే సమాధానాలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. పూర్తిస్థాయిలో సమాచారం రాబట్టేందుకు మరోసారి వంశీని కస్టడీకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
నిన్న ఎస్సీ, ఎస్టీ కోర్టుకు సెలవు కావడంతో వంశీని మరో కోర్టులో హాజరుపరిచారు. జైలులో ఒంటరిగా ఉండటం ఇబ్బందిగా ఉందని, మరికొంత మంది ఖైదీలతో కలిసి ఉండే అవకాశం కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ప్రాసిక్యూషన్ వాదనలు విన్న తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
