ఎస్సీ వర్గీకరణ అంశంలో ముఖ్య పాత్ర పోషించిన మందకృష్ణ, సీఎం చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
“ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి చేరుకోవడంలో మందకృష్ణ, చంద్రబాబు నాయుడులే కారణమని” ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మాదగ కులానికి వన్నె తెచ్చిన మందకృష్ణను ప్రత్యేకంగా అభినందించిన పవన్ కల్యాణ్, ఎస్సీ వర్గీకరణపై చాలా చర్చలు జరిగాయని, గుర్తింపు లేని కులాలపై విస్తృతంగా చర్చలు జరిగినట్లు తెలిపారు.
అంతకుముందు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో రెల్లి కులస్తులు అధికంగా ఉన్నారని, అసమానతలను అధిగమించేందుకు ఇంకా పోరాటం అవసరమని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్న చంద్రబాబు, 2026లో జనగణన అనంతరం జిల్లాల వారీగా కేటగిరీల విభజన జరుగుతుందని తెలిపారు.
ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, జిల్లాల వారీగా దామాషా ప్రకారం రిజర్వేషన్ విధానం అమలు చేయాలని సూచించారు. సీఎం చంద్రబాబు చొరవతో దళిత వాడల్లో సంపద సృష్టి జరిగిందని వివరించారు.
ఇక టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీ మోహన్ మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎస్సీలకు సంబంధించిన అనేక పథకాలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ కోసం టీడీపీ ఎప్పటి నుంచీ కట్టుబడి ఉందని తెలిపారు.
సభలో చర్చ అనంతరం మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఏక సభ్య కమిషన్ నివేదికను ప్రవేశపెట్టారు.
Our YouTube channel Click Here

One thought on “ఎస్సీ వర్గీకరణపై పవన్ కల్యాణ్ ప్రశంసలు”
Comments are closed.