మంత్రి సీతక్కపై మావోయిస్టుల హెచ్చరిక లేఖ

seethakka

తెలంగాణలో మావోయిస్టులు మరోసారి ప్రకటనతో సంచలనాన్ని రేపారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆదివాసీ హక్కులపై మౌనంగా ఉన్నారని ఆరోపిస్తూ, ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్కకు మావోయిస్టులు హెచ్చరికలతో కూడిన లేఖను విడుదల చేశారు. ఆదివాసీలను ఇబ్బందుల్లో ముంచుతున్న ప్రభుత్వం వైఖరిపై మావోయిస్టులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఆదివాసీలపై ఆంక్షలు పెడుతున్నా.. మంత్రి సీతక్క స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పెసా, 1/70 చట్టాలను మంత్రి సీతక్క ఎందుకు గౌరవించడంలేదని ప్రశ్నించారు.

జీవో నెంబర్ 49పై కూడా మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జీవో ద్వారా కుమురం భీమ్ జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలోని మూడు జిల్లాలు కనుమరుగవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మావోయిస్టులు, తమ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖను విడుదల చేశారు. మంత్రి సీతక్కపై విమర్శలు చేస్తూ ఆదివాసీల హక్కులకు ఆమె పూర్తిగా బాధ్యత వహించాలని లేఖలో స్పష్టం చేశారు.

Read More : పెద్దపల్లిలో రైల్వే ట్రాక్‌పై విరిగిపడిన క్లస్టర్‌