ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ – రాష్ట్ర అభివృద్ధి, ఎస్ఎల్‌బీసీ ప్రమాదంపై కీలక చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న తన పర్యటనలో భాగంగా ఆయన ఈ ఉదయం ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లి మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రాభివృద్ధి కోసం చేపట్టిన పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న నిధులను త్వరగా విడుదల చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రాజెక్టులకు నిధుల విజ్ఞప్తి
ఈ సమావేశంలో ముఖ్యంగా ఫేస్-2 మెట్రో ప్రాజెక్టు, ఎయిర్‌పోర్ట్ మెట్రో పొడగింపు, మూసీ నది పునరుద్ధరణ, వెనకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఐటీఐఆర్, ఐఐఎం, రీజనల్ రింగ్ రోడ్ అనుమతులు, ఆర్థిక సహాయం వంటి అంశాలను సీఎం రేవంత్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
ఎస్ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా
ఈ భేటీలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ప్రమాద స్థితిగతులు ఎలా ఉన్నాయంటూ సీఎం రేవంత్‌ను అడిగి తెలుసుకున్నారు. దీనిపై స్పందించిన సీఎం, టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే, భారీగా నీరు, బురద పేరుకుపోవడం సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని వివరించారు.
ఈ సమావేశంలో సీఎం రేవంత్‌తో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డీజీపీ జితేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రధాని భేటీ అనంతరం రేవంత్ రెడ్డి పలు కేంద్రమంత్రులతోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది.

One thought on “రాష్ట్రాభివృద్ధి, ఎస్ఎల్‌బీసీ ప్రమాదంపై కీలక చర్చ”
Comments are closed.