ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అందరి దృష్టి కొత్త రాజ్యసభ అభ్యర్థులపైనే ఉంది. వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేసిన వారి స్థానంలో ఎవరు వెళ్లిపోతారనే దానిపై ఆసక్తి నెలకొంది. బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్. కృష్ణయ్య వైసీపీకి రాజీనామాలు చేశారు. వీళ్లలో బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. ఆర్. కృష్ణయ్య ఇంకా ఏ పార్టీలో చేరలేదు కానీ, ఆయన బీజేపీలో చేరడం ఖాయం అని భావిస్తున్నారు. దీంతో, వీళ్ల స్థానంలో ఎవరు రాజ్యసభకు వెళ్లిపోతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇప్పటికే వచ్చింది. ఈ నెలాఖరులోపు ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాలను పరిశీలిస్తే, మూడు స్థానాలూ కచ్చితంగా కూటమికి దక్కుతాయని అంచనా. వైసీపికి కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్నందున పోటీ చేసే అవకాశం చాలా తక్కువ. టీడీపీలో ఇద్దరు నేతలు చేరడంతో, ఆ రెండు స్థానాల నుంచి టీడీపీ పోటీ చేయడానికి అవకాశం ఉంది. బీద మస్తాన్ రావు ఇప్పటికే ఢిల్లీకి మళ్లీ వెళ్లాలని కోరుకుంటున్నట్టు ప్రకటించారు, దీంతో ఆయనకు ఓ బెర్త్ ఖచ్చితంగా దక్కే అవకాశం ఉంది. మోపిదేవి వెంకటరమణ రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని సంకల్పించారనే సమాచారం. ఈయన స్థానంలో భాష్యం రామకృష్ణ, వర్ల రామయ్య తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా, సానా సతీష్ పేరు కూడా వినిపిస్తోంది. సానా సతీష్ ఇటీవల కాకినాడ పార్లమెంటు నుండి పోటీ చేయాలని ప్రయత్నించారు, కానీ జనసేనకు ఆ సీటును వదిలిచారు. ఈ నేపథ్యంలో, సానా సతీష్ ను రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.
ఆర్. కృష్ణయ్య బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఆ స్థానం నుంచి ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపిస్తారని సమాచారం. ఆయన పదవీకాలం 2028 వరకు ఉంది. కాబట్టి, ఆయన మళ్లీ రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నారని చెప్పారు. దీనికి బీజేపీ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ గా ఆర్. కృష్ణయ్యను నియమించాలనే ప్రచారం వచ్చినప్పటికీ, ప్రస్తుతం రాజ్యసభకు వెళ్లడం ఆయనకు బెట్టర్ ఆప్షన్ అవుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా, బీద మస్తాన్ రావు, సానా సతీష్, ఆర్. కృష్ణయ్య పేర్లు దాదాపు ఖరారైనట్లు కనిపిస్తున్నాయి.
గత వారం రోజులుగా జనసేన నేత నాగబాబు పేరును కూడా బలంగా ప్రస్తావించుకున్నారు. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బీజేపీకి నాగబాబును రాజ్యసభకు పంపించే అవకాశం ఇవ్వాలని కోరినట్టు వార్తలు వచ్చాయి. అనకాపల్లి స్థానాన్ని బీజేపీకి వదిలిచిన నేపథ్యంలో, జనసేనకు ఆ స్థానాన్ని ఇవ్వడానికి కమలం పార్టీ కూడా సన్నద్ధమై ఉందని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఖాళీ అయిన స్థానాలు రెండు లేదా నాలుగు సంవత్సరాల కాలపరిమితితో ఉంటాయి. అందుకే నాగబాబును పూర్తిస్థాయి పదవీకాలంతో రాజ్యసభకు పంపించే నిర్ణయంపై బీజేపీ, జనసేన ఒకే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, నాగబాబుకు ఈసారి రాజ్యసభ స్థానం లేనట్లే అనిపిస్తోంది.
