జాన్వీ కపూర్‌పై మాలీవుడ్ విమర్శలు

సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా తుషార్ జలోటా దర్శకత్వంలో రూపొందిన ‘పరం సుందరి’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ మలయాళ యువతి పాత్రలో ఆకట్టుకోనుంది. ఆమె దీక్షా పట్టా సుందరై దామోదరం పిళ్లైగా తెరపై కనిపించనుంది. అయితే, ఓ హిందీ నటి మలయాళ అమ్మాయి పాత్రలో నటించడం పై మాలీవుడ్ వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. తమకే ఆ అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కొంతమంది మలయాళ నటీమణులు అభిప్రాయపడ్డారు. జాన్వీకంటే తాము ఆ పాత్రను మరింత బాగా పోషించగలమని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన నాయికల వలన తమలాంటి వారికి అవకాశాలు తగ్గిపోతున్నాయంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విమర్శలకు జాన్వీ తెలివిగా స్పందించింది. ‘పరం సుందరి’లో తాను కేవలం కేరళ యువతిగా మాత్రమే కాకుండా తమిళ యువతిగానూ కనిపిస్తానని స్పష్టం చేసింది. తనకు కేరళ మూలాలు లేవని, తల్లి శ్రీదేవి కూడా మలయాళీ కాదని చెప్పింది. అయితే అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను తాను ఎప్పుడూ గౌరవిస్తానని, ఆ ప్రాంతానికి చెందిన అమ్మాయి పాత్రలో నటించడం తన అదృష్టమని భావిస్తానని వివరించింది.

ఓనం పండుగ ప్రత్యేకతను ప్రస్తావిస్తూ, అవకాశం వస్తే మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని జాన్వీ చెప్పింది. దీంతో ఆమెపై వస్తున్న విమర్శలకు కొంతవరకు బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది.

మొత్తంగా చూస్తే, ఈ వివాదం జాన్వీని మరింత హైలైట్ చేస్తూ ‘పరం సుందరి’ సినిమాకి అదనపు ప్రచారం తెచ్చిపెట్టింది.

Read More : Avneet Kaur Response : విరాట్ లైక్‌ వెనక అసలు నిజం ఏమిటి?

One thought on “జాన్వీ కపూర్‌పై మాలీవుడ్ విమర్శలు

Comments are closed.