మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు – పవన్ కల్యాణ్‌కు చిరు ఆశీస్సులు

మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. అభిమానులు పండుగ వాతావరణంలో జరుపుకుంటుండగా, సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చిరుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ కూడా తన అన్నయ్యకు హృదయపూర్వక విషెస్‌ తెలియజేస్తూ, చిరంజీవి పట్టుదల, కార్యదీక్షతలను ప్రశంసించారు.

దీనిపై స్పందించిన చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌కు ప్రత్యేక ఆశీస్సులు అందజేశారు. ట్విట్టర్‌లో చేసిన పోస్టులో “జనసేనాధ్యక్షుడికి విజయోస్తు” అంటూ పవన్‌ పంపిన శుభాకాంక్షలు తన హృదయాన్ని తాకాయని పేర్కొన్నారు. అన్నయ్యగా తనకు గర్వం కలిగిందని, తమ్ముడు విజయాలు, పోరాటాలు చూసి మరింత ఆనందం కలుగుతోందని చిరు తెలిపారు.

అలాగే, “నీ వెనుక కోట్లాది మంది జనసైనికులు ఉన్నారు. వారిని ఒక రాజువై నడిపించు. వారి ఆశలు, కలలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీతో ఉంటుంది. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాయి” అని చిరు ట్వీట్‌లో రాశారు.

ఈ సందేశంతో పాటు, పవన్ చిన్ననాటి ఫొటోలు, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేసిన చిత్రాలను కూడా జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Read More : ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు కఠిన హెచ్చరిక ?

2 thoughts on “మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు – పవన్ కల్యాణ్‌కు చిరు ఆశీస్సులు

Comments are closed.