రాజమండ్రి పర్యటన వాయిదా – చంద్రబాబు, పవన్‌పై బొత్స ఫైర్

రాజమండ్రిలో ఈ నెల 25న జరగాల్సిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది. వినాయక చవితి తర్వాతే ఆయన పర్యటన జరగవచ్చని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన బొత్స, ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. “ప్రతి విషయంలో వైసీపీ, జగన్ పేరు తీస్తున్నారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 16 సార్లు ఢిల్లీకి వెళ్లినా సీఎం చంద్రబాబు ఏం సాధించారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యం” అని ఆయన అన్నారు. 30వ తేదీన వైజాగ్‌లో జరిగే జనసేన సభలో పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ అంశంపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో కూర్చుని ఏం చేస్తున్నారు? ప్రధాని యోగా డే వల్ల విశాఖకు ఎలాంటి లాభం కలగలేదని విమర్శించారు. “పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ ఏమయ్యింది? రేషన్ బియ్యం మాఫియా గత ఐదేళ్లలో అరకొరగా జరిగితే, ఇప్పుడు పదిరెట్లు పెరిగింది. తాజాగా వైజాగ్‌లో మూడు సార్లు డ్రగ్స్ పట్టుబడ్డాయి” అని బొత్స ఆరోపించారు.

సీఎం చంద్రబాబు సింగపూర్‌కి పెట్టుబడులు రప్పించడానికి కాకుండా పెట్టుబడులు పెట్టుకోవడానికే వెళ్లారని బొత్స ఎద్దేవా చేశారు. “పీ4 విధానంలో చంద్రబాబు వైఖరి ట్రంప్ తరహాలో ఉంది. మూడు రాజధానుల అంశం సున్నితమైనది. మా పార్టీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు.

ప్రజల పట్ల నిర్లక్ష్యం, పరిపాలనలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల కూటమి ప్రభుత్వం 16 నెలల్లోనే పూర్తిగా వైఫల్యం చెందిందని బొత్స తీవ్ర విమర్శలు గుప్పించారు.

Read More : ఢిల్లీ పర్యటనలో సీఎం !