దేశవ్యాప్తంగా విమానాశ్రయాలపై ఉగ్ర ముప్పు

దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రవాద, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అన్ని విమానాశ్రయాల్లో హైఅలర్ట్ ప్రకటించబడింది.

వివరాల్లోకి వెళ్తే… ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్యలో విమానాశ్రయాలపై దాడులు జరగవచ్చని నిఘా నివేదికల్లో సూచించబడింది. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో అన్ని ఎయిర్‌పోర్టులకు అడ్వైజరీ జారీ చేసింది. రన్‌వేలు, హెలీప్యాడ్లు, ఫ్లయింగ్ స్కూళ్లు, శిక్షణా సంస్థల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

విమానాశ్రయాల భద్రతా సిబ్బంది ఇప్పటికే అలర్ట్‌ అయ్యారు. టెర్మినల్స్, పార్కింగ్ ఏరియాలు, పెరీమీటర్ జోన్ల వంటి సున్నితమైన ప్రదేశాల్లో పెట్రోలింగ్‌ను పెంచారు. స్థానిక పోలీసుల సహకారంతో ఎయిర్‌పోర్టులకు వెళ్లే మార్గాల్లో కూడా కఠిన తనిఖీలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయ సిబ్బంది, కాంట్రాక్టర్లు, సందర్శకులపై కూడా కఠిన తనిఖీలు నిర్వహించనున్నారు.

అదేవిధంగా ప్రయాణికులకు కూడా అధికారులు సూచనలు జారీ చేశారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Read More : సింహం దగ్గరికి వెళ్లి వీడియో తీయాలన్న యువకుడు

One thought on “దేశవ్యాప్తంగా విమానాశ్రయాలపై ఉగ్ర ముప్పు

Comments are closed.