రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు (People), దార్శనికత (Vision), ప్రకృతి (Nature), సాంకేతికత (Technology) అనే నాలుగు మూలస్తంభాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమై ఉండాలని ఆయన సూచించారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP), కీలక పనితీరు సూచికలు (Key Performance Indicators)పై ప్రణాళికా శాఖ సహా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
“నాలుగు సూత్రాలు – అభివృద్ధికి దారి”
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, “ప్రజలనే కేంద్రంగా చేసుకుని, భవిష్యత్ దృష్టితో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ధేశించాలి. పర్యావరణానికి హాని కలగకుండా, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తేనే అద్భుతమైన ఫలితాలు సాధించగలం” అని అన్నారు.
ఆగస్టు 15 నుంచి 700 ఆన్లైన్ సేవలు
రానున్న ఆగస్టు 15 నుంచి 700 రకాల ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. పాలనలో పారదర్శకత, వేగం పెంపుకు టెక్నాలజీని గరిష్టంగా ఉపయోగించాలన్నారు. 2029 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రూ. 5.42 లక్షలకు చేర్చడమే లక్ష్యమని, 2025–26 నాటికి ఇది రూ. 3.47 లక్షలుగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి శాఖకు పనితీరు సూచికలు
ప్రతి శాఖ తమ పనితీరును కొలిచే నిర్దిష్ట సూచికలు ఏర్పరచుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్ర ప్రణాళికా విభాగం, నీతి ఆయోగ్ తరహాలో అన్ని శాఖలకు మార్గదర్శకత్వం వహించాలని ఆదేశించారు. “రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగితేనే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించగలం. వ్యవసాయం, మైనింగ్ రంగాల్లో ఉత్పత్తులకు విలువ జోడింపుపై దృష్టి సారించాలి” అని చెప్పారు.
సింగపూర్ ఉదాహరణ – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం
“కేవలం 60 లక్షల జనాభా ఉన్న సింగపూర్ అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తుంటే, 140 కోట్ల జనాభా, విస్తారమైన వనరులు కలిగిన భారత్ మరింత విజయాలు సాధించవచ్చు. మనకు మనమే తెలివైన వాళ్లమని భావించకుండా ప్రపంచాన్ని చూడాలి. ఆర్టీజీఎస్ ద్వారా వచ్చే సమాచారాన్ని క్రోడీకరించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్లేషిస్తే ప్రభుత్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రతి త్రైమాసికానికీ పురోగతిపై శాఖలు సమీక్షలు జరపాలి” అని సూచించారు.
కుటుంబాన్ని ఒక యూనిట్‌గా
ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని వారి ఆర్థిక, ఆరోగ్య వివరాలను నమోదు చేసి, పథకాలతో పాటు వారి ఆదాయం పెరుగేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఈ సమీక్షలో మంత్రి పయ్యావుల కేశవ్, ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read More : తల్లి, ఇద్దరు కుమార్తెల దారుణ హత్య

One thought on “ఆగస్టు 15 నుంచి 700 ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో”
Comments are closed.