ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఆగ్రహం

ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎన్నికల సంఘంపై సీరియస్ ఆరోపణలు చేశారు. ఓట్ల విషయంలో ఆరు నెలలపాటు స్వంతంగా దర్యాప్తు జరిపి, “అణుబాంబు లాంటి ఆధారాలను సేకరించాం. ఆ బాంబు పేలిన రోజున ఎన్నికల సంఘానికి దాక్కోవడానికి కూడా అవకాశం ఉండదు” అని రాహుల్ గాంధీ లోక్‌సభలో వ్యాఖ్యానించారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అనంతరం ముసాయిదా జాబితాను ఈసీ విడుదల చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచే ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ, బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. “రాష్ట్ర స్థాయి నుంచి భారీగా ఓటర్ల దొంగతనం జరుగుతోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ, లోక్‌సభ ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయి. కోట్లాది కొత్త ఓటర్లను అక్రమంగా జాబితాలో చేర్చుతున్నారు. ఇది దేశద్రోహం కంటే తక్కువేమీ కాదు” అని మండిపడ్డారు.

దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించిన రాహుల్ గాంధీ, “రిటైర్ అయినా సంబంధం లేదు. ఎవరినీ వదిలిపెట్టం” అని స్పష్టం చేశారు.

అయితే, రాహుల్ గాంధీ ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. “అవి పూర్తిగా నిరాధారమైనవి. రోజూ వచ్చే ఈ తరహా బెదిరింపులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పారదర్శకంగా పనిచేస్తున్నాం. బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను విస్మరించమని మా అధికారులకు స్పష్టం చేశాం” అని ఈసీ స్పష్టంచేసింది.

Read More : మాలేగావ్ కేసులో భగవత్ అరెస్ట్ ఆదేశాలు

One thought on “ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ ఆగ్రహం

Comments are closed.