కర్ణాటక రాష్ట్రం మైసూరులో ప్రేమ పేరుతో ఓ యువకుడు జరిపిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తనను ప్రేమించలేదన్న కోపంతో ఓ యువతిపై కత్తితో దాడి చేసి, రక్తపు మడుగులో ఉన్న ఆమె మెడలో తాళి కట్టి సెల్ఫీ తీసుకున్నాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల వివరాల ప్రకారం, మైసూరుకు సమీపంలోని పాండవపురాకు చెందిన యువతిని అభిషేక్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ఆమెను కలిసి తన ప్రేమను అంగీకరించాలంటూ ఒత్తిడి చేశాడు. అయితే ఆమె నిరాకరించడంతో, అభిషేక్ ఆగ్రహంతో రగిలిపోయి వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
దాడిలో స్పృహ తప్పిన యువతిని చూసి, అతను ఆమె మెడలో తాళి కట్టి సెల్ఫీ తీసుకున్నాడు. అనంతరం అదే వ్యక్తి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించడంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది.
పోలీసులు అభిషేక్‌పై హత్య కేసు నమోదు చేసి అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన మైసూరు సహా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది.
