ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆరోగ్య రీత్యా రాజీనామా చేసాను అని పేర్కొన్నప్పటికీ కొన్నీ రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అందులోను పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే అనూహ్యంగా రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల చేత రాజీనామా చేసినట్లుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ పంపించారు. అనంతరం రాజీనామాపై పొలిటికల్ దుమారం రేపింది. పెద్దల ఒత్తిడితోనే ఆయన రాజీనామా చేశారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ధన్ ఖడ్ ఉంటున్న అధికార నివాసాన్ని అధికారులు సీజ్ చేశారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. అవన్నీ తప్పుడు వార్తలుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తోసిపుచ్చింది. ఒక వర్గం మీడియా ధన్ ఖడ్ నివాసాన్ని సీజ్ చేశారంటూ.. తక్షణమే ఖాళీ చేయించిందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని పీఐబీ కొట్టిపారేసింది. తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని, అధికారికంగా వచ్చిన వార్తలను ధృవీకరించుకోవాలని ప్రజలను కోరింది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వాదనలు పూర్తిగా నకిలీవి అని పీఐబీ పేర్కొంది.
కాగా, ఉపరాష్ట్రపతి పదవికి ధన్ ఖడ్ రాజీనామా చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా నోటిఫై చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లోని క్లాజ్ 2 ప్రకారం ఉపరాష్ట్రపతి మరణం, రాజీనామా లేదా తొలగింపు లేదా ఇతరత్రా కారణాల వల్ల ఖాళీగా ఉన్న పదవిని భర్తీ చేయడానికి ఎన్నిక వీలైనంత త్వరగా నిర్వహించబడుతుందని పేర్కొంది.
ఇదిలా ఉంటే ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కోసం ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపింది. పార్లమెంటు ఉభయసభలకు ఎన్నికైన, నామినేటెడ్ సభ్యులతో ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటు కానుంది. త్వరలో దీనిపై షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలున్నాయి. అధికారిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఎన్నికల షెడ్యూలు ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ఒక పత్రికా ప్రకటన లో తెలిపింది.

One thought on “ఉప రాష్ట్రపతి నివాసాన్నిసీజ్ చేసారంటూ ప్రచారం… కేంద్రం క్లారిటీ”
Comments are closed.