ఇటీవల కాలంలో కొంతమంది యూట్యూబర్లు స్టాండప్ కామెడీ పేరుతో అసభ్యకరమైన పదాలు వాడుతూ..చివరకు తల్లిదండ్రులపై కూడా బయటకు చెప్పకూడని విషయాలను చెప్పి అనారోగ్యకర వినోదాన్ని పంచుతున్నారు, రాజకీయ నేతలపై కూడా తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో.. సుప్రీం కోర్టు సీరియస్ గా మందలించడం చూశాము. కానీ, ఇంట జరుగుతున్నా కొంతమంది వారి తీరును ఏ మాత్రం మార్చుకోవట్లేదు. తాజాగా మీడియాలో కొందరు యూట్యూబర్లు, స్టాండప్ కమెడియన్లు, కళాకారులు ఇష్టానుసారం అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి పోస్టుల కట్టడికి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సోషల్ మీడియాలో ఏం చేసినా.. ఏం చెప్పినా చెల్లిపోతుందనే ధోరణి పలువురిలో కనిపిస్తోందని సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయని మండిపడింది. ప్రధాని నరేంద్రమోదీ, RSS పై వేసిన కార్టూన్ అభ్యంతరకరంగా ఉండటంతో తనపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కార్టూనిస్టు హేమంత్ మాలవీయ వేసిన పిటిషన్ పై విచారణ సమయంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వనియోగం చేయవద్దని హెచ్చరిస్తూ.. కార్టూనిస్టు హేమంత్ మాలవీయకు అరెస్టు నుంచి సుప్రీం కోర్టు రక్షణ కల్పించింది. అయితే ఇదే విధంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులను షేర్ చేస్తే.. చట్టం ప్రకారం అతడిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉందని జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ అరవింద్ కుమార్ లతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది.
ప్రధాని నరేంద్రమోదీ, RSS పై వేసిన కార్టూన్ అభ్యంతరకరంగా ఉండటంతో కార్టూనిస్టు హేమంత్ మాలవీయపై న్యాయవాది, ఆర్ఎస్ఎస్ కార్యకర్త వినయ్ జోషి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. మాలవీయ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన విషయాలను అప్లోడ్ చేయడం ద్వారా హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని జోషి ఆరోపించారు. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ.. హేమంత్ మాలవీయ మధ్యప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం దానిని తోసిపుచ్చడంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు.
