చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కలైంజర్ కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే ముత్తు (ముత్తువేల్ కరుణానిధి ముత్తు) అనారోగ్యంతో ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వయసు 76 సంవత్సరాలు. ఎంకే ముత్తు జననం 1948 జనవరి 14న కరుణానిధి–పద్మావతి దంపతులకు జరిగింది. తన తండ్రి కళాస్వభావాన్ని అనుసరించిన ఎంకే ముత్తు తొలుత నాటక రంగంలోకి ప్రవేశించి, ఆ తర్వాత తమిళ సినిమాల్లో నటించారు. 1970వ దశకంలో డీఎంకే పార్టీ వేదికలపై పాటలతో ప్రజల్లో విశేష ఆదరణ పొందారు. ఆయన ‘పిళ్లైయో పిళ్లై’, ‘పూకారి’, ‘షయాలికారన్’, ‘దమయ విల్లుక్కు’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాల్లోనే కాకుండా, డీఎంకే కార్యకలాపాల్లో పాటల రూపంలో పార్టీకే తన సేవలు అందించారు.
ముత్తు మృతితో డీఎంకే పార్టీ దిగ్భ్రాంతికి లోనైంది. ఈ నేపథ్యంలో సీఎం ఎంకే స్టాలిన్ అన్నయ్య మృతికి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ముత్తు భౌతికకాయాన్ని గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. పార్టీ ఇవాళ నిర్వహించాల్సిన అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది. సీఎం స్టాలిన్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో భావోద్వేగపూరితంగా స్పందిస్తూ…
“మా కుటుంబానికి మూలస్తంభమైన నా పెద్ద అన్నయ్య ఎంకే ముత్తు ఇకలేరు. మా తల్లిదండ్రుల మాదిరిగానే ఆయన నన్ను ప్రేమించారు. నా హృదయానికి అత్యంత సమీపమైన వ్యక్తిని కోల్పోయాను. ఆయన పేరును మా తాత ముత్తువీరన్ నుండి పెట్టారు” అని తెలిపారు.
అన్నయ్యకు అక్షయమైన నివాళులు అర్పించిన స్టాలిన్, పార్టీ నేతలు, అభిమానులు ఆయన సేవలను స్మరించుకుంటున్నారు.
Read More : పక్కటెముకల్లో తీవ్ర నొప్పితో విలవిల్లాడిపోయిన PK..
