యెమెన్ మరణశిక్ష కేసులో నిమిష ప్రియకు సుప్రీం కోర్టు ఊరట

యెమెన్‌లో మరణశిక్ష విధింపబడి కష్టాల్లో ఉన్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ కోసం భారత్ ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఈ కేసులో బాధితుని కుటుంబంతో మాట్లాడేందుకు అనుమతి కోరుతూ, నిమిష ప్రియ తరఫున న్యాయవాదుల బృందం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం, అనుమతి విషయమై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇక నిమిష ప్రియ మరణశిక్షను యెమెన్ తాత్కాలికంగా నిలిపివేసిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ మేరకు అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వెల్లడించారు. నిమిష ప్రియను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలపై సుప్రీం కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. భారత్ యెమెన్‌తో సంబంధాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తోందని కోర్టు అభిప్రాయపడింది.

విచారణ సందర్భంగా నిమిష ప్రియ తరఫు న్యాయవాదులు, బాధితుడి కుటుంబంతో సంప్రదింపుల కోసం యెమెన్‌కు వెళ్లే అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. యెమెన్‌కు వెళ్లడంపై ప్రస్తుతం ఆంక్షలు ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది.

Read More : ఆనంద్ మహీంద్రా తెలుగులో ట్వీట్ వైరల్: ఫ్యూరియో-8 ట్రక్కు