టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను ఇవ్వాలని పలు పార్టీలకు చెందిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాక, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆయనకు ప్రసంగించే అవకాశం కల్పించాలన్న డిమాండ్ కూడా విస్తృతంగా వినిపిస్తోంది. ఇటీవల ‘అఖిలపక్ష భారత పార్లమెంటరీ ఫోరమ్ ఫర్ టిబెట్’ నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై కీలక తీర్మానాలు ఆమోదించబడ్డాయి. ఈ ఫోరమ్‌కి బీజేడీ రాజ్యసభ సభ్యుడు సుజీత్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో బీజేపీ, జేడీయూ, ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. దలైలామాకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌కు మద్దతుగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు కన్వీనర్ సుజీత్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా టిబెట్ మత వారసత్వ ఎంపికలో చైనా జోక్యాన్ని ఎంపీలు తీవ్రంగా ఖండించారు. 14వ దలైలామా వారసుడిని ఎంచుకునే హక్కు టిబెట్ ప్రజలకే ఉందని స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు భారీ ర్యాలీ నిర్వహించాలంటూ అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తాపిర్ గావో సూచించారు. అంతేగాక, ఇటీవల అమెరికా కాంగ్రెస్ టిబెట్‌కు అనుకూలంగా ఆమోదించిన బిల్లును ఫోరమ్ అభినందించింది. భారత పార్లమెంటులో కూడా అలాంటి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని ఎంపీలు వ్యక్తం చేశారు. దేశంలోని టిబెటన్ శరణార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు స్థానిక అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలకు సూచించారు.
ఈ పరిణామం, చైనాతో ఉన్న దౌత్య సంబంధాల నేపథ్యంలో మరోసారి సవాలుగా మారే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read More : సింహం దాడికి 50 ఏళ్ల మహిళ గాయాలు

One thought on “భారతరత్నను దలైలామాకు ఇవ్వాలన్న డిమాండ్..”
Comments are closed.