టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా తన జీవిత విశ్వాసాలు, భావోద్వేగాలను బహిర్గతం చేశారు. జూలై 6న తన 90వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాబోయే 30-40 సంవత్సరాల పాటు ప్రజల కోసం సేవ చేయాలన్నదే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తాను ఇంకా ఆరోగ్యంగా బతికే సూచనలు దేవుడిచ్చిన సంకేతాలుగా భావిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా గతంలో తాను కలలో 110 ఏళ్లు బతుకుతానని చూసినదాన్ని గుర్తు చేశారు. ప్రజల పట్ల ఉన్న తన నిబద్ధతను మరోసారి వెల్లడించారు.
అలాగే, తన తరువాతి వారసుడి ఎంపికపై దలైలామా కీలక ప్రకటన చేశారు. 15వ దలైలామాను ఎన్నుకునే అధికారం పూర్తిగా “గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్”కే చెందుతుందంటూ స్పష్టం చేశారు. ఈ విషయంలో బౌద్ధ మత పెద్దలతో 2011లోనే సంప్రదింపులు జరిపానని, వారి అనుమతిని తీసుకున్నానని తెలిపారు.
చైనా ఎప్పటి నుంచో తన వారసుని ఎంపికపై జోక్యం చేసుకోవాలని చూస్తోందని పరోక్షంగా హెచ్చరించారు. ఇప్పటికే పంచెన్ లామా వారసుడిగా ఎంపికైన బాలుడిని చైనా ప్రభుత్వమే నియమించిన నేపథ్యంలో, తన పునర్జన్మ టిబెట్ వెలుపల కూడా జరగవచ్చని ముందే స్పష్టంచేశారన్నారు.
దలైలామా వ్యాఖ్యలు మరోసారి ఆయన మనోధైర్యాన్ని, ధర్మం పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబించాయి.

2 thoughts on “దలైలామా భావోద్వేగం: ప్రజలకు సేవే నా ప్రధాన ఆకాంక్ష”
Comments are closed.