ఫిల్మ్ నగర్ ఎస్ఐ రాజేశ్వర్ మృతి

సంగారెడ్డి జిల్లా పరిధిలో జరిగిన దుర్ఘటనలో హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజేశ్వర్ దుర్మరణం పాలయ్యారు. విధులు ముగించుకుని స్వగృహానికి వెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో పోలీసు శాఖలో తీవ్ర విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళితే…

గత మూడు రోజులుగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఉత్సవాల నేపథ్యంలో బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్ఐ రాజేశ్వర్, బుధవారం రాత్రి తన డ్యూటీ పూర్తిచేసుకుని కారులో సంగారెడ్డి జిల్లా చాణక్యపురి కాలనీలోని ఇంటికి బయలుదేరారు. అర్ధరాత్రి సమయంలో చేర్యాల గేటు వద్దకు రాగానే, వేగంగా వచ్చిన ఓ లారీ ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా ఢీకొట్టింది. దీంతో కారు తీవ్రంగా ధ్వంసమై, ఎస్ఐ రాజేశ్వర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆయనను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు.

1990 బ్యాచ్‌కు చెందిన రాజేశ్వర్, కేవలం వారం రోజుల క్రితమే ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన కొద్దీ రోజులకే ఆయన మృతిచెందడం తోటి సిబ్బందిని తీవ్రంగా కలిచివేసింది. రాజేశ్వర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read More : గుర్తింపు ప్రక్రియపై బంధువుల ఆవేదన

One thought on “ఫిల్మ్ నగర్ ఎస్ఐ రాజేశ్వర్ మృతి

Comments are closed.