కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు జరపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వేచి చూస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో సుమారు నాలుగు లక్షల డబుల్ ఓట్లు ఉన్నాయని, రాష్ట్రంలో ఓటర్ల జాబితాను సమగ్రంగా సవరించే అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తాము ఓట్ల చోరీ చేసి ఉంటే, లోక్‌సభలో బీజేపీ సీట్లు తగ్గే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రానికి యూరియా సరఫరాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనతో మాట్లాడినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు అదనంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని మంత్రి అభ్యర్థించగా, రాష్ట్రానికి రావాల్సిన వాటాను తప్పకుండా పంపిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రామగుండం ఫ్యాక్టరీలో సాంకేతిక సమస్యల కారణంగా ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయిందని వివరించారు.
పార్టీ ఫిరాయింపులపై స్పందించిన ఆయన, కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకే తీరుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. బీజేపీలోకి రావాలనుకునే వారు ముందుగా తమ పదవులకు రాజీనామా చేసి రావాలని స్పష్టం చేశారు. మొయినాబాద్ ఫాం హౌస్ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని మరోసారి తేల్చిచెప్పారు.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం మెట్రో నష్టాల్లో నడుస్తోందని, దీంతో కొత్త లైన్ల నిర్మాణంపై ఎల్ అండ్ డీ ఆసక్తి చూపడం లేదని అన్నారు. అయితే, మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. బీహార్‌లో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read More : హైదరాబాద్‌లో ఓపెన్ ఏఐ కార్యాలయం ఏర్పాటు చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి

One thought on “కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ దర్యాప్తు: కిషన్ రెడ్డి వ్యాఖ్యలు”
Comments are closed.