Neeraj : ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి నెంబర్ వన్

భారత జావెలిన్ త్రో చాంపియన్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మళ్లీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వరుస అంతర్జాతీయ టోర్నీలలో మెరిసిన నీరజ్, గ్రెనడాకు చెందిన అథ్లెట్ అండర్సన్ పీటర్స్‌ను వెనక్కునెట్టి మరోసారి నెంబర్ వన్‌గా నిలిచాడు.

వరల్డ్ అథ్లెటిక్స్ తాజాగా విడుదల చేసిన జావెలిన్ ర్యాంకింగ్స్‌లో నీరజ్ చోప్రా 1,445 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో పీటర్స్ 1,431 పాయింట్లతో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది జర్మనీ అథ్లెట్ జూలియన్ వెబర్ 91.06 మీటర్ల రికార్డు త్రోతో మూడో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ స్టార్ అర్షద్ నదీమ్ (1,370 పాయింట్లు) నాలుగో స్థానంలో, చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్ ఐదో స్థానంలో ఉన్నాడు.

గత ఏడాది సెప్టెంబరులో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన అనంతరం నీరజ్ నెంబర్ వన్ ర్యాంకును కోల్పోయిన సంగతి తెలిసిందే. కానీ 2025లో అతని తిరిగివస్తూ చూపిన ప్రదర్శన దేశానికే గర్వకారణమైంది. ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికాలో పోచ్ ఇన్విటేషనల్ టోర్నీ విజయం, దోహా డైమండ్ లీగ్‌లో 90.23 మీటర్ల త్రోతో చరిత్ర సృష్టించడం, పోలాండ్‌లో జానస్ కుసోసిన్‌స్కీ మెమోరియల్ టోర్నీలో రెండో స్థానం – ఇవన్నీ నీరజ్ ఆధిపత్యానికి నిదర్శనంగా నిలిచాయి.

అంతేకాదు, ఈ నెలలో జరిగిన పారిస్ డైమండ్ లీగ్ (88.16 మీటర్లు), ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ (85.29 మీటర్లు) టోర్నీల్లో స్వర్ణ పతకాలు గెలుచుకుని తన అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేశాడు.

విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే – ఈ ఏడాది అండర్సన్ పీటర్స్‌తో తలపడ్డ నాలుగు పోటీల్లోనూ నీరజ్ విజయం సాధించాడు. మొత్తంగా ప్రధాన టోర్నీల ఫైనల్స్‌లో పీటర్స్‌పై 16-5 తేడాతో ఆధిక్యంలో ఉన్నాడు. ఇక ఈ జులై 5న బెంగళూరులో జరగనున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ ఈవెంట్‌లో మరోసారి ఈ ఇద్దరు స్టార్ అథ్లెట్లు ఢీకొనబోతుండటంతో, క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

Read More : ఐసీసీ : టీ20, టెస్టులకు కొత్త నిబంధనలు

One thought on “Neeraj : ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి నెంబర్ వన్

Comments are closed.