ఐసీసీ : టీ20, టెస్టులకు కొత్త నిబంధనలు

అంతర్జాతీయ క్రికెట్‌ను మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలతో టీ20లు, టెస్టు ఫార్మాట్లు కొత్త ఒరవడిలోకి వెళ్లనున్నాయి. ముఖ్యంగా వర్షం వల్ల ఓవర్లు కుదించే మ్యాచ్‌లలో పవర్‌ప్లే లెక్కల్లో స్పష్టత తీసుకురాగా, టెస్టుల్లో స్లో ఓవర్ రేట్ నియంత్రణకు ‘స్టాప్ క్లాక్’ను అమలులోకి తెచ్చింది.

టీ20ల్లో కొత్త పవర్‌ప్లే గణనలు

ఇప్పటి వరకు ఓవర్లు తగ్గించిన మ్యాచ్‌లలో పవర్‌ప్లేను సరాసరి గణనతో నిర్ణయించేవారు. ఇకపై మాత్రం ఖచ్చితమైన గణిత ప్రమాణాలతో నిర్ణయిస్తారు. ఉదాహరణకు, 8 ఓవర్ల మ్యాచ్‌కు 2.2 ఓవర్లు మాత్రమే పవర్‌ప్లే అవుతుంది. ఈ సమయంలో 30 గజాల సర్కిల్ వెలుపల ఇద్దరికి మాత్రమే ఫీల్డింగ్ అనుమతిస్తారు.

ఈ కొత్త నిబంధనలు 2024 జూలై నుంచి అంతర్జాతీయ టీ20లపై వర్తించనున్నాయని ఐసీసీ వెల్లడించింది. వివిధ ఓవర్ల మ్యాచ్‌లకు పవర్‌ప్లే గణన ఇలా ఉంటుంది:

  • 5 ఓవర్లకు: 1.3 ఓవర్లు
  • 6 ఓవర్లకు: 1.5 ఓవర్లు
  • 10 ఓవర్లకు: 3.0 ఓవర్లు
  • 12 ఓవర్లకు: 3.4 ఓవర్లు
  • 16 ఓవర్లకు: 4.5 ఓవర్లు

టెస్టుల్లో ‘స్టాప్ క్లాక్’ ప్రారంభం

స్లో ఓవర్ రేట్‌ కారణంగా ఆట ఆలస్యం అవుతోందన్న ఆరోపణల నేపథ్యంలో, టెస్టుల్లోను ‘స్టాప్ క్లాక్’ విధానం అమలులోకి వచ్చింది. 2025-27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ నుంచే ఇది అమలవుతోంది.

ఒక ఓవర్ ముగిసిన 60 సెకన్లలోపు తదుపరి ఓవర్‌కు ఫీల్డింగ్ జట్టు సిద్ధంగా ఉండాల్సిందే. వాయిదా పడితే మొదట రెండు హెచ్చరికలు, మూడోసారి అయినప్పుడు బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు. 80 ఓవర్ల తర్వాత ఈ హెచ్చరికలు రీసెట్ అవుతాయి.అలాగే బ్యాటర్లు ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్ తీస్తే, తదుపరి బంతికి ఎవరు స్ట్రైక్‌ తీసుకోవాలో నిర్ణయించుకునే అధికారాన్ని ఫీల్డింగ్ జట్టు కెప్టెన్‌కు ఇచ్చారు.

ఈ మార్పులు శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య గాలే టెస్టుతో ప్రారంభమయ్యాయి.

Read More : రిషభ్ పంత్ – 800 పాయింట్లు దాటి అరుదైన రికార్డు

One thought on “ఐసీసీ : టీ20, టెస్టులకు కొత్త నిబంధనలు

Comments are closed.