పతంజలి భారీ పెట్టుబడి.. ఉత్తరాంధ్రకు పరిశ్రమల ఊపు

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం, చినరావుపల్లి గ్రామంలో 172 ఎకరాల భూమిలో పతంజలి భారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ కోసం వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ తెలిపారు.
ఈ మేరకు ఆయన స్వయంగా పరిశ్రమ స్థలాన్ని సందర్శించి, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో ప్రాంతీయ అభివృద్ధికి బీజం పడుతుందని, వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు.

ఈ సందర్భంగా బాబా రాందేవ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ‘విజనరీ లీడర్’గా కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయన దూరదృష్టి, సహకారం వల్లే పతంజలి ఈ భారీ ప్రాజెక్టు చేపట్టగలిగిందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న మద్దతుతో ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు.

పతంజలి పరిశ్రమ వల్ల ఉత్తరాంధ్రలో పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు వచ్చి, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

One thought on “పతంజలి భారీ పెట్టుబడి.. ఉత్తరాంధ్రకు పరిశ్రమల ఊపు

Comments are closed.