మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్‌…

శత్రుదేశం పాకిస్థాన్ కాల్పుల్లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు.

బెంగుళూరు నివాసం నుంచి ఉదయం రోడ్డు మార్గంలో బయలుదేరిన జగన్, కల్లి తండా గ్రామానికి చేరుకుని మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలను కలుసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్, మురళీ నాయక్ చేసిన త్యాగం దేశం ఎప్పటికీ మర్చిపోదని, ఆయన స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచిపోతారని అన్నారు.

వీర జవాన్ కుటుంబానికి వైసీపీ తరఫున రూ. 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. తమ పార్టీ తరఫున కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పరామర్శ అనంతరం జగన్ తిరుగు పయనమయ్యారు.

ఈ సందర్భంగా చోటుచేసుకున్న భావోద్వేగ క్షణం అందరినీ కదిలించింది. మురళీ నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ, “మురళీ… నీ కోసం జగనన్న వచ్చాడు… లేచి సార్‌కి సెల్యూట్ కొట్టు రా బాబూ…” అని అన్నపుడు అక్కడున్నవారందరూ భావోద్వేగానికి గురయ్యారు.

ఇదిలా ఉంటే, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మురళీ నాయక్ కుటుంబానికి రూ. 50 లక్షలు, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలం, అలాగే కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన వ్యక్తిగతంగా రూ. 25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

Read More : ఎన్టీఆర్ జిల్లాలో విషాదం