సింధు జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. జమ్మూకశ్మీర్‌లోని అదనపు జలాలను పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు తరలించేందుకు 113 కిలోమీటర్ల పొడవైన కాలువ నిర్మాణం కోసం కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల అధ్యయనం ఇప్పటికే ప్రారంభమైంది.
ఇందులో భాగంగా తూర్పు నదులు రావి, బియాస్, సట్లెజ్ నదులతోపాటు, సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్‌కు కేటాయించిన పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నదుల నుంచి గరిష్ఠంగా నీటిని వినియోగించుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాకిస్థాన్‌కు వెళ్లే అదనపు నీటి ప్రవాహం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
అంతేకాక, జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో అనేక సంవత్సరాలుగా నిలిచిపోయిన ఉయ్జ్ బహుళార్థ సాధక ప్రాజెక్టును కేంద్రం పునరుద్ధరించనుంది. చీనాబ్ నదిని రావి-బియాస్-సట్లెజ్ నదులతో అనుసంధానించే ఈ ప్రతిపాదిత కాలువ జమ్మూ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లలోని 13 ప్రాంతాలను కలుపనుంది. దీని ద్వారా ఇందిరా గాంధీ కాలువకు కూడా నీటిని అందించనున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, “మూడేళ్లలో సింధు జలాలను కాలువల ద్వారా రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ వరకు తీసుకెళ్తాం. సాగునీటి అవసరాలు తీరటంతో పాటు పాకిస్థాన్ ప్రతి నీటి బొట్టు కోసం అలమటించే పరిస్థితి ఏర్పడుతుంది” అని తెలిపారు.
ఇక గత ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ దీర్ఘకాలిక ప్రాజెక్టులతో పాటు బగ్లిహార్, సలాల్ జలాశయాల్లో పూడికతీత, అలాగే పాకల్ దుల్ (1000 మెగావాట్లు), రాట్లే (850 మెగావాట్లు), కిరు (624 మెగావాట్లు), క్వార్ (540 మెగావాట్లు) వంటి జలవిద్యుత్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తోంది. దీంతో సింధు జలాల వినియోగాన్ని భారత్ మరింతగా విస్తరించనుంది.
Read More : లక్నోలో సౌదీ ఎయిర్‌లైన్స్‌కు తప్పిన ప్రమాదం

2 thoughts on “సింధు జలాల వినియోగంపై భారత్ కీలక నిర్ణయం”
Comments are closed.