టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్పందన.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ అనంతరం బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. కమిషన్ ఎదుట ఈటెల చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయంటూ మండిపడ్డారు.

‘‘కాళేశ్వరం నిర్మాణంలో కేసీఆర్‌కు ఎలాంటి తప్పులేదు, కేబినెట్ నిర్ణయానుసారంగానే అన్ని జరిగాయి’’ అనే ఈటెల వ్యాఖ్యలు గమనిస్తే, అవి పూర్తిగా బుకాయింపు గా కనిపిస్తున్నాయని గౌడ్ విమర్శించారు. ముఖ్యంగా ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెలకు ప్రాజెక్టు నిధులపై సంబంధం లేదనడం హాస్యాస్పదమన్నారు. దేశమంతా కాళేశ్వరం ద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పుకుంటుంటే, ఈటెల మాత్రం వ్యతిరేకంగా మాట్లాడడం ఆలోచన కలిగించేదిగా ఉందన్నారు.

కేసీఆర్‌ను కాపాడేందుకే ఈటెల ఈ రీతిలో మాట్లాడినట్లు స్పష్టం

కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లా మారిందని గతంలో పలు ఆరోపణలు వచ్చాయని, కానీ ఇప్పుడు ఈటెల అభిప్రాయాలు వాటికి విరుద్ధంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందన్నారు. ‘‘ఈటెలకు కూడా వాటాలు ముట్టినందునే ఈ విధంగా కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే, ఆయన ఇంకా బీఆర్ఎస్‌తోనే ఉన్నట్లు తెలుస్తోంది’’ అని గౌడ్ ఆరోపించారు.

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారిగా ఎలాంటి ఒప్పందం ఉందా?

‘‘కమిషన్ ముందు బుకాయించేందుకు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల ముందుగానే ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇప్పుడు అందరూ ఒకే విధంగా స్పందిస్తున్న తీరులో ఇది బలంగా అనిపిస్తోంది. బీజేపీ నాయకులు గతంలో చేసిన అవినీతి ఆరోపణలు ఇప్పుడు ఏమయ్యాయి?’’ అంటూ గౌడ్ ప్రశ్నించారు.

బీజేపీకి గట్టిగా సవాల్

‘‘ఈటెల వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? లేక బీజేపీ అధికారిక విధానమా? బీజేపీ నిజంగా అవినీతి నిరోధించాలనుకుంటే ఈటెలపై చర్యలు తీసుకోవాలంటూ’’ గౌడ్ డిమాండ్ చేశారు. అవినీతిపై నిజమైన విచారణకు సిద్ధమా అని బీజేపీని నిలదీశారు. లేదంటే కేసీఆర్‌తో బీజేపీకి రహస్య ఒప్పందమే ఉన్నదని ప్రజలు భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Read More : తెలంగాణ హక్కుల కోసం రాజీలేని పోరాటం