కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘనలపై కొనసాగుతున్న విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును (KCR) విచారించిన తర్వాతే తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది.
ఈ నేపథ్యంలో, అసలు షెడ్యూల్ ప్రకారం ఈ నెలాఖరుతో ముగిసే కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలలు పెంచింది. దీంతో కమిషన్ జూలై 31వ తేదీ వరకు నివేదికను సమర్పించే అవకాశం ఏర్పడింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా సోమవారం జీవో విడుదల చేశారు.
అంతకుముందు కమిషన్ మొదట మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్‌తో పాటు కేసీఆర్ పాత్రను పత్రాల ఆధారంగా మాత్రమే పరిశీలించి, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని భావించింది. అయితే, సహజ న్యాయసూత్రం ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి వివరణ ఇవ్వడానికి అవకాశం కల్పించాల్సి ఉంటుందన్న దృష్టితో, కేసీఆర్‌ను విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సమన్లు అందిన తర్వాత వారం రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని కమిషన్ కోరే అవకాశం ఉంది.
ఇంతకుముందు ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్లపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి కమిషన్ కూడా కేసీఆర్‌కు సమన్లు జారీ చేసింది. అయితే విచారణ పూర్తికాకముందే తనను దోషిగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారంటూ కేసీఆర్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు స్పందించిన సుప్రీంకోర్టు, నర్సింహారెడ్డి వ్యవహారశైలిపై అభ్యంతరం వ్యక్తం చేసి ఆయన్ను విచారణ బాధ్యతల నుంచి తప్పించింది.
ఆ తరువాత బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ కమిషన్, కేసీఆర్ రాసిన లేఖను ఆధారంగా తీసుకుని విద్యుత్ ప్రాజెక్టులపై తుది అభిప్రాయాన్ని రూపొందించింది. గత అనుభవాల నేపథ్యంలో జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని ఈ కమిషన్ మరింత జాగ్రత్తగా ముందుకు సాగుతుండటం గమనార్హం. కేసీఆర్‌కు పూర్తి వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే కమిషన్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Read More : తెరపైకి మోస్తరు నుంచి భారీ వర్షాలు

One thought on “కాళేశ్వరం బ్యారేజీలపై విచారణలో కీలక మలుపు.”
Comments are closed.