వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రంగాపూర్ గ్రామ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ దుర్ఘటనలో మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే… ఓ పెళ్లి బస్సు రంగాపూర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. బస్సులో ప్రయాణిస్తున్నవారిలో మల్లేశ్, సందీప్, బాలమణి, హేమలత అనే నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులంతా పెళ్లికూతురు బంధువులుగా గుర్తించారు.

ప్రమాదానికి కారణమైన డ్రైవర్ అజాగ్రత్త, అధిక వేగమేనని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని హైదరాబాదుకు రిఫర్ చేసినట్టు సమాచారం.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read More : హైడ్రా సంస్థలో 200 డ్రైవర్ ఉద్యోగాలు.