శాంతి భద్రతల రీత్యా పోలీసుల కీలక నిర్ణయం

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, హైదరాబాద్‌లో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో శాంతిభద్రతలు నిలుపుకునేందుకు పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బాణసంచా కాల్చడంపై నగర వ్యాప్తంగా తక్షణమే నిషేధం విధిస్తున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు.

ఇప్పటి నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. ప్రస్తుత సున్నిత పరిస్థితుల్లో బాణసంచా శబ్దాలు పేలుళ్ల శబ్దాలుగా అనిపించి ప్రజల్లో ఆందోళన కలిగించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. అలాంటి గందరగోళ పరిస్థితులకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

శాంతియుత వాతావరణాన్ని కాపాడటం, ప్రజల భద్రతకు భరోసా కల్పించడమే తమ లక్ష్యమని కమిషనర్ స్పష్టం చేశారు. నిషేధాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశ భద్రత దృష్ట్యా ప్రజలు పోలీసులు తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని ఆయన కోరారు.

సరిహద్దుల్లో పరిస్థితులు చక్కబడే వరకు ఈ నిషేధం కొనసాగే అవకాశం ఉందని, నగర ప్రజలందరూ శాంతి పరిరక్షణకు సహకరించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

Read More : మాజీ మంత్రి మల్లారెడ్డి పాకిస్తాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు