భారత ప్రభుత్వం టెరిటోరియల్ ఆర్మీకి అధికారం

భారత ప్రభుత్వం పాకిస్థాన్ నుండి వస్తున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రక్షణ వ్యూహంలో భాగంగా, అవసరమైన సమయంలో టెరిటోరియల్ ఆర్మీ సేవలను వినియోగించుకునేందుకు ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారం కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. “ఆపరేషన్ సింధూర్” పేరిట భారత సైన్యం పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న కుతంత్రాలను వ్యతిరేకంగా ఉద్దేశించి, సర్వసన్నద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

పాకిస్థాన్ నుండి డ్రోన్లు, క్షిపణులతో భారత దేశంపై దాడులు జరగ్గా, వాటిని సమర్థంగా తిప్పికొట్టిన భారత సైన్యం, పాక్ సరిహద్దుల్లో మరిన్ని అలజడులు సృష్టించే కుట్రపై నిఘా సమాచారంతో అప్రమత్తమైంది. ఈ నేపథ్యం లో, భారత సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం, అవసరమైతే, టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించేందుకు నిర్ణయించుకుంది. టెరిటోరియల్ ఆర్మీ అధికారులను, నమోదైన సిబ్బందిని రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేయడానికీ ఆదేశించింది.

టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏమిటి?

టెరిటోరియల్ ఆర్మీ అనేది ‘సైనిక రిజర్వ్ దళం’గా వ్యవహరిస్తుంది. దేశంలో క్లిష్ట పరిస్థితులు తలెత్తినప్పుడు, ఈ దళాలు రెగ్యులర్ సైన్యానికి మద్దతుగా నిలుస్తాయి. వీరిని కఠినమైన శిక్షణ ఇచ్చి, శాంతి కాలంలో స్వచ్ఛందంగా దేశ సేవలో పాల్గొనేలా తయారు చేస్తారు. 1948లో భారత టెరిటోరియల్ ఆర్మీ చట్టం ఆమోదించబడింది మరియు 1949లో దీనికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి. ప్రస్తుతానికి ఈ దళంలో సుమారు 50 వేల మంది క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.

గత యుద్ధాలలో, 1962, 1965, 1971 యుద్ధ సమయాల్లో టెరిటోరియల్ ఆర్మీ భారత రెగ్యులర్ ఆర్మీతో కలిసి పోరాటం చేసింది. ప్రకృతి విపత్తులు సంభవించిన సందర్భాల్లో కూడా ఈ దళాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఇటీవల కేరళ వరదల సమయంలో, ప్రముఖ నటుడు మోహన్‌లాల్ కూడా టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా సేవలు అందించారు.

టెరిటోరియల్ ఆర్మీలో ఉన్న ప్రముఖులు

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ వంటి ప్రముఖులు కూడా టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ హోదాలు కలిగి ఉన్నారు. వీరికి పింఛను, క్యాంటీన్, వైద్య సదుపాయాలు వంటి ప్రయోజనాలు అందిస్తారు.

Read More : భారత్ పర్యటనలో అజయ్ బంగా కీలక వ్యాఖ్యలు

One thought on “భారత ప్రభుత్వం టెరిటోరియల్ ఆర్మీకి అధికారం

Comments are closed.