దేశ ప్రజలకు ముఖ్యంగా రుణగ్రహీతలకు శుభవార్త తెలిపింది భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ). ద్రవ్య విధాన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంటూ, రెపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫలితంగా ప్రస్తుతం రెపో రేటు 5.5 శాతానికి చేరింది. ఈ నిర్ణయం గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతర దీర్ఘకాలిక రుణాలు తీసుకున్నవారికి ఈఎంఐ భారం తగ్గే అవకాశం కల్పించనుంది.
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఈ సమావేశం నిర్వహించింది. దేశీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం స్థితిగతులు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో లోతైన చర్చ అనంతరం కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. ఈ తగ్గింపు తక్షణమే అమలులోకి వస్తుందని ఆర్బీఐ ప్రకటించింది.
రుణగ్రహీతలకు లాభం
ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడంతో రుణగ్రహీతలకు, ముఖ్యంగా ఇల్లు కొనాలనుకునే వారికి ఇది పెద్ద ఊరటగా మారనుంది. రెపో రేటు తగ్గడంతో బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. దాంతో, గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) తక్కువగా ఉండబోతున్నాయి. ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వృద్ధిలో భారత్ ముందంజలోనే
ఈ సందర్భంగా గవర్నర్ మల్హోత్రా మాట్లాడుతూ, “ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నా, భారతదేశం వేగంగా వృద్ధి చెందుతూనే ఉంది. ఐదు కీలక రంగాల్లో ఉన్న స్థిరత వల్ల మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది. దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు భారత్ గొప్ప అవకాశాలను కల్పిస్తోంది” అని వివరించారు. ఆర్బీఐ తాజా నిర్ణయం భారత ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More : ప్రధాని మోదీ ప్రారంభించిన చీనాబ్ రైల్వే వంతెన.

One thought on “ఆర్బీఐ నిర్ణయం: రెపో రేటు తగ్గింపు… రుణగ్రహీతలకు ఊరట.”
Comments are closed.